రైల్వే లైన్ పనులు ముమ్మరం చేయండి అధికారులతో సమీక్షించిన మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట వాస్తవ తెలంగాణ:-రైల్వే లైన్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువ లేనిదని రైల్వే శాఖ సైతం ఇప్పటికే కితాబిచ్చిందని, మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.
జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం రైల్వే, రెవెన్యూ, ఇరిగేషన్, ఇండస్ట్రీయల్, విద్యుత్ అధికారులతో మనోహరాబాద్ రైల్వే లైన్ పనుల ప్రగతి, వేగవంతం పై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మనోహరాబాద్ రైల్వే లైన్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందనున్నదని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికార వర్గాలకు దిశానిర్దేశం చేశారు. ఈ రైల్వే లైన్ నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువ లేనిదని రైల్వే శాఖ సైతం ఇప్పటికే కితాబిచ్చిందని మంత్రి చెప్పారు.
సిద్దిపేట పట్టణ మిట్టపల్లి శివారులో రైల్వే స్టేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని కుకునూర్ పల్లి వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల విషయమై ఆర్అండ్ బీకి భూమి అప్పగింత అంశాలపై చర్చించారు. ఇండస్ట్రీయల్ భూమి లెవల్ చేసి, ఆ మట్టి రైల్వే లైన్లకు ఉపయోగించాలని అధికార వర్గాలకు సూచించారు. దుద్దేడ సమీపంలో పౌల్ట్రీ ఫామ్స్ స్ట్రక్చర్స్ పేమెంట్స్ నిధులు మంజూరుకై చర్చించి త్వరలోనే ప్రభుత్వ ఆమోదం వస్తుందని మంత్రి పేర్కొన్నారు. మిట్టపల్లి ప్రాంతంలో రైల్వే లైను కోసం పెండింగులో ఉన్న భూ సేకరణ పూర్తి చేసి రైల్వే అధికారులకు అప్పగించాలని ఆర్డీఓ, రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని రిజర్వాయర్ల మీదుగా ఈ లైన్ వెళుతున్న దరిమిలా రైల్వే ద్వారానే రిజర్వాయర్లలో పెంచే చేపలు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే వెసులుబాటు ఉన్నదని పేర్కొన్నారు.
అంతకుముందు ఈ ఫిబ్రవరి నెలాఖరులోగా మిగిలిన గొర్రెలు, పశువుల హాస్టల్స్ ప్రారంభించేలా సమీక్షించి సన్నాహాలు జరపాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి సత్యప్రసాద్ ను ఆదేశించారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి సంక్షేమ పథకాలు, పురోభివృద్ధి అంశాలపై చర్చించారు. సమీక్షలో రైల్వే శాఖ ఈఈ జనార్ధన్, పశుసంవర్ధక అధికారి సత్యప్రసాద్, బాల సుందరం, ఇరిగేషన్ విష్ణు వర్ధన్, రెవెన్యూశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments