Wanted Reporters

Wanted Reporters

కెమెరా ఆగింది కన్నీరు మిగిలింది జర్నలిస్ట్ ఏబీఎన్ గిరి కుటుంబాన్ని ఆదుకోండి

 *కెమెరా ఆగింది.. కన్నీరు మిగిలింది* 


 *జర్నలిస్ట్ ఏబీఎన్ గిరి కుటుంబాన్ని ఆదుకోండి* 


 *సహాయానికి నోచుకోని తల్లిదండ్రుల ఎదురుచూపు* 


 *ఆర్థిక సంక్షోభంతో చిన్నాభిన్నం అయిన కుటుంబం* 


 *మానవతా వాదులు స్పందించండి* 


 *కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తండ్రి మాదిరాజు సత్యనారాయణ రావు* 


షాదనగర్ తెలంగాణ సాక్షి న్యూస్:-

 ఎందరో జీవితాల సమస్యలకు పరిష్కారాన్ని అందించిన కెమెరా అతనిది.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఆయన కలం, ఎన్నో ఫలితాలకు ఆదర్శం అతడు.

కానీ కెమెరా ఆగింది.. కన్నీరు మిగిల్చింది. నియోజక వర్గంలో ఎవరు పిలిచినా పలుకుతూ వారి సమస్యల్లో మమేకమై అందరి సమస్యలు తనవిగా భావించి సమాజానికి తన వంతు సహకారం అందించిన జర్నలిస్ట్ "ఏబీఎన్ గిరి" మృతి తర్వాత ఆయన కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.  గిరి తల్లిదండ్రులకు ఆయన ఒక్కడే కుమారుడు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదుకునే బాధ్యత అతనిపై ఉండగా అతను కోవిడ్ బారినపడి మృత్యువాత పడ్డాడు. గిరి తల్లిదండ్రులకు ఇప్పుడు జీవనం భారమై వృద్ధాప్యంలో ఏలాంటి కూలినాలి చేసుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఆయన తల్లిదండ్రులు ఉన్నారు. జర్నలిస్ట్ ఏబీఎన్ గిరి కుటుంబ కన్నీటి గాధ బయటి ప్రపంచానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత సాటి జర్నలిస్టులపై ఉంది. గిరి ఉన్నంతకాలం తల్లిదండ్రులకు ఏ లోటు రాకుండా బాగా చూసుకున్నారు. విధి వైపరీత్యం గిరి మరణించగా ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆదుకునే నాథుడు లేడు.

వయోభారంతో ఆ తల్లిదండ్రులు కృంగి పోతుండగా ఇప్పుడు పుత్రశోకంతో ఆదుకునే దిక్కులేక తల్లడిల్లుతున్నారు.


 *ఇదీ ఏబీఎన్ గిరి నేపధ్యం...* 


రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన మాదిరాజు హరికృష్ణ అలియాస్ గిరి అందరికీ సుపరిచితుడు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థలో గత 13 ఏళ్లుగా జర్నలిస్టుగా పనిచేశారు. ఏప్రిల్ 25వ తేదీన కోవిడ్ చికిత్సపొందుతూ గిరి మృత్యువాత పడ్డాడు. అప్పటినుండి ఆయన కుటుంబం చిన్నాభిన్నమైంది. గిరికి తల్లిదండ్రులు మాది రాజు సత్యనారాయణరావు, పద్మమ్మ తల్లిదండ్రులు ఉన్నారు  అదేవిధంగా భార్య ఒక పాప ఉంది. తండ్రి

సత్యనారాయణ 76ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్నారు. ఇటీవల వారి కుటుంబం కూడా కోవిడ్ బారినపడి కోలుకుంది. కుమారుడు గిరి ఉన్నంతకాలం తల్లిదండ్రులకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. ప్రతి నెల ఇంటి అద్దె ఇతర నిత్యావసర వస్తువులను తల్లిదండ్రులకు సమకూర్చే వాడు. గిరి మరణం తర్వాత వాళ్లకు లేకుండా పోయింది. వృద్ధాప్యంలో వాళ్లు ఎలాంటి కూలినాలి చేసుకోలేని దుస్థితి. ఈ సందర్భంగా ఆయన తండ్రి మాదిరాజు సత్యనారాయణరావు సిటీ టైమ్స్ ను ఆశ్రయించారు. తనకు ఎలాంటి బ్రతుకుదెరువు లేదని తన కుమారుడు ఉన్నంతకాలం తనను బాగా చూసుకున్నాడని ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడనీ, తమ పరిస్థితి దైన్యం గురించి వివరించారు. బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామం వారి స్వస్థలం అని పేర్కొన్నారు. 1987లో పొట్ట చేత పట్టుకొని షాద్ నగర్ పట్టణానికి వచ్చారని తెలిపారు. తమ జీవనం కోసం పుస్తకాలు బైండింగ్ చేసుకుంటానని, తన కుమారుడు వీడియో గ్రాఫర్ గా జీవితం ప్రారంభించాడని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి లేక ఆర్థికంగా భారం అయిందని, అదేవిధంగా తన కుమారుడు గిరి మృతి చెందిన తర్వాత తమకు ఆర్థిక ఆదుకునేవారు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గిరి తండ్రి సత్యనారాయణకు గుండె జబ్బు ఉంది ఆయనకు నెలసరి మందులు ఇంటి అద్దె కుటుంబం గడవడానికి నిత్యావసర వస్తువుల అవసరం ఉంది. ఆయన ఈ వయసులో పని చేసుకోలేరు.  


 *మానవతా దృక్పథంతో ఆడుకోవాలి* 


ఏబీఎన్ గిరి కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఈ సమాజంలో ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టుల పదవులు మాత్రమే వన్నె తెస్తాయి కానీ వారి జీవితాలు ఆర్థికంగా ఎందుకు పనికిరావు. సమాజంలో కొంత మంది మాత్రమే ఎంతో కొంత ఆర్థికంగా ఉన్న జర్నలిస్టులు ఉన్నారు.95% చాలా మంది జర్నలిస్టులు ఇల్లు గడవని పరిస్థితి. ఇదే కోవకు చెందిన వాడు గిరి. తాను పనిచేస్తే తప్ప తన కుటుంబానికి గడవదు. జర్నలిస్ట్ గిరి తన విధి నిర్వహణలో ఎల్లప్పుడూ సమస్యల పరిష్కారం కోసం ముందుండే వాడు. ఏ రాజకీయ నాయకుడు, ప్రజా ప్రతినిధులు పిలిచినా వెంటనే వాలిపోయేవారు. సమస్యల పరిష్కారానికి కృషి చేసే వాడు. అలాంటి గిరిని కన్న తల్లిదండ్రులని మానవతా దృక్పథంతో ఆదుకునే మహానుభావులు ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది  ఏబీఎన్ గిరి తండ్రి మాదిరాజు సత్యనారాయణ గూగుల్ పే నెంబర్ 9566936171, తమకు తోచిన సహాయం చేయగలరు. జర్నలిస్టు యూనియన్లు, సంఘాలు రాజకీయాలకు అతీతంగా అందరూ ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం కూడా తల్లిదండ్రులతో పాటు ఆయన భార్యను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..  *(లోకల్ టైమ్స)

Post a Comment

0 Comments

Ad Code