తెల్లని లుంగి
మల్లెపూవులాంటి అంగి
బుర్ర మీసాలు
అజానుభాహుడు
నడకలో రాజసం
గుబురు మీసాలను సవరించే చేయి
ఆ ఠీవి చూస్తే...
ఈర్ష పుట్టాల్సిందే
చివరికి శవమై..
అంబులెన్స్‌లో ఊరికి చేరాడు
మట్టిలో కలిసి
కుటుంబాన్ని శోకంలో ముంచాడు
ఆయన చేసిన పాపమేంటీ..?
అజానుభాహుడు శవమెలా అయ్యాడు..?
తెలంగాణ సాక్షి న్యూస్
దర్పంగా కోవిడ్ వార్డులోకి అడుగుపెట్టాడు చండూరుకు చెందిన పోచయ్య. వెంట కుమారుడు మల్లేశం, బావమరిది కిష్టయ్య. ఆ రాజసం చూస్తే ఇక్కడికి ఎందుకొచ్చాడబ్బా అనిపిస్తుంది. నాకూ అలాగే అనిపించింది. కరోనా రావడంతో సంగారెడ్డిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లాడు పోచయ్య. 12 గంటలకు 20 వేలు బిల్లు వేశారు. నాలుగు రోజుల చికిత్సకు రెండు లక్షల రూపాయలు అడిగారు. ఆ స్థోమత లేక జిల్లా కేంద్ర ఆసుపత్రికి వచ్చాడు. అదే ఆయన చేసిన ప్రాణాంతక పొరపాటు. వచ్చినప్పుడు అంతా బాగుంది. తల, ముఖం నొప్పి ఉన్నా... ప్రయివేటులో ఇచ్చిన మందుల ప్రభావంతో ఆ బాధ తెలియలేదు. ఆ రోజు రాత్రి ప్రశాంతంగా గడిచింది. అదే ఆఖరు. మరునాటి నుండి మొదలైంది తీవ్రమైన నొప్పి. క్షణం కూడా భరించలేని భాధ. కూర్చోడు... నిలబడడు.. వెళ్లలేడు.. నొప్పి, నొప్పి.. అంటూ ఒకే రోదన. గంభీరమైన వ్యక్తి, అజానుబాహుడు. బాధ భరించలేక కళ్ల నుండి నీటి దార. పగలంతా పోచయ్య కనిపించిన ప్రతి ఒక్కరినీ వేడుకోవడమే.. ఆ బాధ నుండి విముక్తి కల్గించమని. పోచయ్య కుమారుడు మల్లేశందీ అదే పరిస్థితి. కాళ్లు పట్టుకోవడం ఒక్కటే తక్కువ.
రాత్రి కాగానే నొప్పి మరింత పెరిగింది. కరోనా కిట్‌లో ఉన్న పారసిటమాల్ ఒక్కటే దిక్కు. వైద్యులూ ఆ మాటే చెప్పారు. చివరికి భరించలేక రాత్రంతా వార్డులో తిరుగుతూనే ఉన్నాడు. ఆయనతో పాటు కుమారుడు మల్లేశం. క్షణం కూడా కునుకు తీయలేదు. ఉదయం తీవ్రత అలాగే కొనసాగింది. కనిపించిన ప్రతి ఒక్కరినీ పోచయ్య, మల్లేశం వేడుకున్నారు. పగలంతా అదే పరిస్థితి. ఆ బాధ భరించలేక నా కాళ్లూ పట్టుకోవడానికీ వచ్చాడు పోచయ్య. బలిష్టమైన ఆ మనిషి ఏకదాటిగా ఏడుస్తూనే ఉన్నాడు. నాకూ కన్నీళ్లు ఆగలేదు. చివరికి ఆ రోజు రాత్రి ఒక అల్ట్రాసెట్ గోలి ఇచ్చారు. దీంతో నొప్పి తగ్గింది. తెల్లవారేసరికి నొప్పి మళ్లీ పెరిగింది. దీంతో పాటే ఇతర సమస్యలు వచ్చాయి. ఉన్న చోటనే మూత్రం పోయడం మొదలుపెట్టాడు. మూడు గంటల వరకు ఆ వార్డులోని ఇతరులు ఇబ్బందిపడే స్థాయికి చేరుకుంది. దీంతో మల్లేశం తన తండ్రికి యూరిన్ ట్యూబ్ వేయాలంటూ ఆసుపత్రిలోని వైద్యులను, సిబ్బందిని వేడుకోవడం మొదలుపెట్టాడు. ఐదు గంటల ప్రాంతంలో యూరిన్ ట్యూబ్ వేశారు. దీంతో సమస్య మరింత రెట్టింపు అయ్యింది. మూత్రం పోయలేక, ట్యూబ్ అమరక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. రెండు గంటల పాటు సమస్య గురించి వివరిస్తూ మల్లేశం సిబ్బంది చుట్టూ తిరిగాడు. దీంతో ఆ ట్యూబ్ తీసివేసి మరో ట్యూబ్ వేసే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. తెల్లని లుంగి మొత్తం ఎర్రరంగుగా మారింది. బెడ్‌పైనా.. కిందా.. రక్తమే. రక్తస్రావం అవుతోందంటూ వైద్యుల చుట్టూ, సిబ్బంది చుట్టూ తిరిగాడు. దాదాపు గంటన్నరపాటు బెడ్ నుండి సిబ్బంది గదికి, గది నుండి బెడ్‌కు తిరగడమే. తిరిగి తిరిగి వేసారి స్టాఫ్ రూం వద్ద కూలబడిపోయాడు మల్లేశం. అయినా.. సిబ్బంది రాలేదు. వార్డులోని నాతో పాటు ఇతర రోగుల సహాయకులు అడగడంతో అప్పుడు వైద్యుడు వచ్చాడు. అతనికి 14 నంబర్‌కు బదులుగా 18 నంబర్ యూరిన్ ట్యూబ్ వేశారని, దాని వల్లే సమస్య తీవ్రమైందని తేల్చారు. అందులోనూ 14 నంబర్ యూరిన్ ట్యూబ్ తమ వద్ద లేదని, బయటి నుండి తెచ్చుకోవాలని సూచించారు. సమయం అర్ధరాత్రి 12.30 గంటలు. దిక్కుతోచక తలపట్టుకున్నాడు మల్లేశం. మరోవైపు పోచయ్య బాధతో అల్లాడిపోతున్నాడు. చివరికి నేనే వెళ్లి 14 నంబర్ యూరిన్ ట్యూబ్ తీసుకొచ్చాను. అప్పుడూ అదే పరిస్థితి. పురుషాంగంలోకి యూరిన్ ట్యూబ్ వేయడం, ఏ... సరిగా లేదంటూ మళ్లీ తీయడం, మళ్లీ వేయడం అదో ఆటైంది. పశువుకు కూడా ఇలా వేయరేమో. ఏలాగోలా ట్యూబ్ వేసేశారు. అప్పటికి సమస్య పరిష్కరమైందనే అనుకున్నాం. తెల్లవారేసరికి పోచయ్య పరిస్థితి పూర్తిగా దిగజారింది. వెంటిలేటర్‌పై పెట్టారు. మధ్యాహ్నం సమయానికి పోచయ్య మృత్యువాత పడ్డాడు. అజానుభాహునిలా వచ్చిన మనిషి చివరికి.. శవమై ఊరికి చేరాడు.
మొత్తం ఎపిసోడ్‌లో పాపం ఎవరిది..? ఖచ్చితంగా పోచయ్యదే. ప్రభుత్వాసుపత్రిని నమ్మి రావడమే చేసిన పాపం. వైద్యులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో సెక్యూరిటీ యూరిన్ ట్యూబ్ వేశాడు. అవగాహన లేకపోవడంతో 14 నంబర్‌కు బదులు 18 నంబర్ వేసేశాడు. చివరికి ఆయన ప్రాణం పోయింది. సెక్యూరిటీ గార్డు ఒక్కడిదే తప్పా...? పట్టించుకోని వైద్యునిదీ, సిబ్బందిదీ ఏమీ లేదా..? నాకు తెలిసి, నా కళ్ల ముందు జరిగిన ఘటన. ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న ఇలాంటి ఘటనలెన్నో... పోతున్న ప్రాణాలెన్నో...


0 Comments