*మిష్టర్ ఇండియా ను కూడా కబళించిన కరోనా......*
తెలంగాణ సాక్షి న్యూస్:-
కరోనా మహమ్మారి ఎంతో తీవ్రంగా ఉంది. ఆరోగ్యంగా ఉన్న వారిని కూడా కరోనా మహమ్మారి కబళించి వేస్తూ ఉంది. ఎంతో మందిని కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకుంది. మిస్టర్ ఇండియా మెడలిస్ట్ జగదీశ్ లాడ్ కరోనాతో మరణించారు. జగదీశ్ వయసు 34 సంవత్సరాలు. జగదీశ్ గుజరాత్ లోని వడోదరలో తుదిశ్వాస విడిచారు. అంతర్జాతీయ బాడీ బిల్డర్ అయిన జగదీశ్ గత నాలుగు రోజులుగా వడోదరలోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్ట్ తో చికిత్స పొందుతున్నారు. జగదీశ్ కు భార్య, ఒక కూతురు ఉన్నారు.ఎన్నో బాడీ బిల్డింగ్ పోటీల్లో ఆయన తన స్వరాష్ట్రం మహారాష్ట్రతో పాటు, భారత్ కు ప్రాతినిథ్యం వహించారు. మిస్టర్ ఇండియా పోటీల్లో ఆయన కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీల్లో కూడా సిల్వర్ మెడల్ సాధించారు. తన కెరీర్ లో ఎన్నో విజయాలను సాధించారు.
వడోదర లోని ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా జగదీశ్ ఆక్సిజన్ సపోర్టుతో ఉన్నారు. శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచారు. జగదీశ్ 'భారత్ శ్రీ' అనే టైటిల్ ను గతంలో గెలుచుకోవడం జరిగింది. కొన్ని సంవత్సరాల కిందట బరోడా నుండి నవీ ముంబైకి వచ్చారు జగదీశ్. బాడీ బిల్డింగ్ ను వదిలి.. లోకల్ జిమ్ లో ట్రైనర్ గా పని చేస్తూ ఉండేవారు. లాక్ డౌన్ సమయంలో జిమ్ లకు ప్రజల తాకిడి తక్కువవ్వడంతో జగదీశ్ కూడా ఆర్థికంగా దెబ్బతిన్నారు. జగదీశ్ మరణానికి సరైన ట్రీట్మెంట్ లేకపోవడం కూడా ఒక కారణమని ఆరోపిస్తూ ఉన్నారు. జగదీశ్ భార్యకు కూడా కరోనా సోకిందని తెలుస్తోంది. అతడు రెంట్ కూడా కట్టే స్థితిలో లేడని తోటి బాడీ బిల్డర్స్ చెప్పారు. బాడీ బిల్డర్స్ కు ఎంతో ఇమ్యూనిటీ పవర్ ఉంటుందని.. అలాంటిది తమ లాంటి వారే కరోనాతో మరణిస్తూ ఉన్నారని.. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సమీర్ దబిల్కర్ అనే బాడీ బిల్డర్ చెప్పుకొచ్చారు. బాడీ బిల్డర్లేమీ దేవుళ్ళు కాదు కదా అని సమీర్ తెలిపారు.
జగదీశ్ బాడీ బిల్డింగ్ ను వదిలి రైల్వేస్ లో ఉద్యోగం కోసం కూడా ఎంతో ప్రయత్నించాడని మరో బాడీబిల్డర్ కూడా తెలిపారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా అతడు ఉద్యోగం కోసం ప్రయత్నించాడని.. ఎవరూ అండగా నిలబడలేదని అన్నారు. సెంట్రల్ రైల్వే బాడీ బిల్డర్ మనోజ్ లఖన్ కూడా గత వారం మరణించాడు. అతడి వయసు 30-32 మధ్య ఉంటుందని తెలిపారు. బాడీ బిల్డర్స్ కూడా కరోనాతో చనిపోతూ ఉన్నారని.. సాధారణ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు నవీ ముంబై బాడీ బిల్డర్స్.

0 Comments