శరవేగంగా బీరంగూడ- కిష్టారెడ్డిపేట రహదారి విస్తరణ పనులు
చివరి దశలో కిష్టారెడ్డిపేట నుండి నర్రేగూడెం బీటీ పనులు
పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
అమీన్పూర్ తెలంగాణ సాక్షి న్యూస్:-
50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బీరంగూడ చౌరస్తా నుండి కిష్టారెడ్డిపేట ఔటర్ రింగ్ రోడ్డు వరకు చేపడుతున్న వంద ఫీట్ల రహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయనీ, ఓ ఆర్ ఆర్ నుండి నర్రె గూడెం చౌరస్తా వరకు విస్తరణ పనులు పూర్తి కావచ్చయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఎంపీపీ దేవానందం, హెచ్ఎండిఎ ఈ ఈ అప్పారావు, డిప్యూటీ ఈఈ దీపక్ లతో కలిసి విస్తరణ పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీరంగుడ చౌరస్తా నుండి ఓఆర్ఆర్ వరకు గల ఐదు కిలోమీటర్ల పరిధిలో రెండున్నర కిలోమీటర్ల విస్తరణ పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. రహదారికి ఇరువైపులా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతోపాటు, ప్రత్యేకంగా వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో రెండు నెలల్లో మిగతా పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రహదారి నిర్మాణం పూర్తయితే అమీన్పూర్ మున్సిపాలిటీ తోపాటు అమీన్పూర్, జిన్నారం మండలాలకు సంబంధించిన వివిధ గ్రామాల ప్రజలకు దూర భారం తగ్గుతుందని తెలిపారు. అంతేకాకుండా అవుటర్ రింగ్ రోడ్డు చేరుకునేందుకు ఈ మార్గం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రహదారి విస్తరణ సమయంలో సంపూర్ణ సహకారం అందిస్తున్న ప్రజలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

0 Comments