పరిశోధనలో నైతికత, జవాబుదారీతనం తప్పనిసరి
పరిశోధన సమగ్రతపై వర్చువల్ సెషన్‌లో వివరించిన సౌమ్య నాయర్
నాణ్యతతో పాటు పారదర్శకత, బాధ్యతాయుత ప్రచురణకు ప్రాధాన్యత ఇవ్వాలి
పటాన్‌చెరు, వాస్తవ తెలంగాణ న్యూస్:
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న పరిశోధన రంగంలో నైతికత, బాధ్యతాయుత ప్రచురణ, సంస్థాగత జవాబుదారీతనం ఎంతో కీలకమని అసోసియేట్ రీసెర్చ్ ఇంటిగ్రిటీ అనలిస్ట్ సౌమ్య నాయర్ స్పష్టం చేశారు.
భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం సహకారంతో స్ప్రింగర్ నేచర్ తన 'రైజ్-ఉత్తాన్' కార్యక్రమంలో భాగంగా గురువారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 'పరిశోధన సమగ్రత' అంశంపై వర్చువల్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సౌమ్య నాయర్ పరిశోధన రంగంలోని పలు కీలక అంశాలను వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలపై విశ్వాసం, విశ్వసనీయత పెంపొందించాలంటే పరిశోధనలో నాణ్యతతో పాటు సమగ్రత, పారదర్శకత, బాధ్యతాయుతమైన మూల్యాంకనం తప్పనిసరిగా ఉండాలని ఆమె పేర్కొన్నారు.
భారత పరిశోధన రంగంలో ఉన్న అవకాశాలతో పాటు పలు సవాళ్లను ప్రస్తావించారు. పరిశోధనలో అక్రమ పద్ధతులు, పేపర్ మిల్లులు, దోపిడీ ప్రచురణలు, సంస్థాగత సామర్థ్యాల్లో అసమానతలు ఆందోళన కలిగిస్తున్నాయని వివరించారు. పరిశోధకుల పరిమాణాత్మక, గుణాత్మక కృషిని సమానంగా గుర్తించే సమతుల్య మూల్యాంకన విధానం అవసరమని సూచించారు.
నైతిక పరిశోధన పద్ధతులు, ఓపెన్ యాక్సెస్, ఓపెన్ సైన్స్, బాధ్యతాయుత ప్రచురణలపై విలువైన సూచనలు చేశారు. పరిశోధన సమగ్రతను విద్యా నైపుణ్యానికి పునాదిగా మార్చుకోవాలని విద్యాసంస్థలకు పిలుపునిచ్చారు.
గీతం విశ్వవిద్యాలయ కేంద్ర పరిపాలనా కార్యాలయం, పరిశోధన అభివృద్ధి సంచాలకులు ప్రొఫెసర్ రామగోపాల్ ఈ సమావేశాన్ని సమన్వయం చేశారు. పలువురు అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు వర్చువల్ ముఖాముఖిలో చురుకుగా పాల్గొని పరిశోధన సమగ్రతకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

0 Comments