Wanted Reporters

Wanted Reporters

తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళిక

 


తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళిక.

- డిసెంబరు తర్వాత సింగూరు నీటి సరఫరా నిలిచే అవకాశం.

- ప్రత్యామ్నాయ వనరుల అభివృద్ధికి రూ.42 కోట్లు

- నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించాలి.

 జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్

వాస్తవ తెలంగాణ న్యూస్ మెదక్ ప్రతినిధి:- 

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నీటి వనరులను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు తాగునీటి భద్రత కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
హవేలీ ఘన్‌పూర్ మండలం సర్దన గ్రామంలోని చెక్‌డ్యామ్‌ను బుధవారం మిషన్‌ భగీరథ, రెవెన్యూ, విద్యుత్తు శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ప్రత్యామ్నాయ నీటి సరఫరాకు అధికారులు రూపొందించిన మ్యాప్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. డిసెంబరు తర్వాత సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం మెదక్ జిల్లాకు రూ.42 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు.సర్దన చెక్‌డ్యామ్ వద్ద ప్రత్యేక గ్రిడ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి 3.5 కిలోమీటర్ల మేర జక్కన్నపేట వరకు పైపులైను నిర్మించనున్నట్లు వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా 33 గ్రామాలకు రోజుకు ఒక్కొక్కరికి 55 లీటర్ల చొప్పున తాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. సర్దనతోపాటు పొడ్చాన్‌పల్లి, కొత్తపల్లి, మిన్‌పూర్ చెక్‌డ్యామ్‌ల వద్ద కూడా గ్రిడ్ వ్యవస్థలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ నీటి వనరులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించుకోవడంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న మిషన్‌ భగీరథ నల్లాలను గుర్తించి నీటి వృథాను అరికట్టాలన్నారు. గ్రామసభల్లో తీర్మానాలు చేసి సింగిల్‌ఫేజ్, త్రీఫేజ్ మోటార్లను నిర్ణీత సమయాల్లోనే నడిపేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవసరం లేని సమయాల్లో మోటార్లను నిలిపివేయడం ద్వారా భూగర్భ జలాలను కాపాడటంతోపాటు విద్యుత్తును ఆదా చేయవచ్చన్నారు. గ్రామాల్లోని త్రీఫేజ్ మోటార్ల ద్వారా ఓవర్‌హెడ్ ట్యాంకులకు నీటిని సరఫరా చేయాలని సూచించారు. విద్యుత్తు సరఫరా మరమ్మతులు, బోర్ల ఫ్లషింగ్, డీపెనింగ్ తదితర పనులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రిజర్వాయర్లు, చెక్‌డ్యామ్‌లలో నీటి నిల్వలు, లభ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఏర్పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రానున్న రోజుల్లో ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈకార్యక్రమంలో మిషన్‌ భగీరథ గ్రిడ్ ఈఈ నాగభూషణం, ఈఈ సంపత్‌కుమార్, ఇంట్రా డీఈ నరేశ్, తహసీల్దార్ సింధు రేణుక, విద్యుత్తు శాఖ డీఈ రామేశ్వరస్వామి, సర్పంచ్ వినోద, గ్రామస్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code